🏠 www.te.republichindustan.in
Watermark
Newspaper Logo
www.te.republichindustan.in | Date: 28 Aug, 2026 | Page: 1

నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసిన నిందితుడు రిమాండ్

*ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు.. వాహనం సీజ్*

*నేరాల నుంచి తప్పించుకునేందుకు వాహనానికి తప్పుడు నంబర్ ప్లేట్ ఏర్పాటు*

*నకిలీ నంబర్లు, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై కఠిన చర్యలు తప్పవు*

*ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు*

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి, పోలీసుల తనిఖీల నుంచి మరియు నేరాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.

భీంసరి గ్రామానికి చెందిన అలిగేటి నర్సింగ్ (43), అలిగేటి తిరుపతి (38) సోదరులు. వీరిలో నర్సింగ్ తన వద్ద ఉన్న యాక్టివా స్కూటీ అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP01 AC 0779 కాగా, పోలీసుల తనిఖీల నుంచి మరియు నేరాల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో వాహనం వెనుక భాగంలో AP01 AC 0770 అనే తప్పుడు నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో ఆగస్టు 27న సాయంత్రం ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితుడి స్కూటీని ఆపి పత్రాలు పరిశీలించేందుకు ప్రయత్నించారు. వాహనం ముందు, వెనుక వేర్వేరు నంబర్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం విచారణ చేపట్టి వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు అలిగేటి నర్సింగ్‌ను రిమాండ్‌కు తరలించారు. నకిలీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసిన యాక్టివా స్కూటీని పోలీసులు సీజ్ చేశారు.

వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం, నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు హెచ్చరించారు.
🏠 Home